అక్కడికి దూరంగా
ఒక చిన్న పల్లెటూరు.
పల్లెకు వెళ్ళాలంటే,
దారి ఎద్దుల బండిలో. బస్ స్టాఫ్ కి ఇరవై అయిదు మైళ్ళ దూరం ప్రయాణం. ఆ పల్లెలో వారి
తాత గారైన కృష్ణమూర్తి పంతులు గారి ఇంటికి బయల్దేరుతున్నాడు మోహన్, దాదాపు పది
సంవత్సరాల తరువాత స్వదేశానికి తిరిగి
వచ్చాక, యన్ఆర్ఐ కోటాలో మెడిసిన్లో చేరాడు బుంటి. అమ్మ-నాన్న
పెట్టిన పేరు రామ్ మోహన్ అయినా, ఇంట్లో
చిన్నప్పటినుండీ, అమ్మకి మాత్రం ప్రేమతో
పిలుచుకునే బుంటి (అదేదో హిందీ సినిమాలో తన అభిమాన హీరో చిన్నప్పటి పేరట, అందుకని) అనే పేరే స్థిరపడింది. తాతగారి, నాయనమ్మల ఎటువంటి
అపోహలు లేని ప్రేమ, వెళ్ళినప్పుడల్లా వాళ్ళ పాలేరు కూతురు కాత్యాయనితో ఆటలు, చెరువులో ఈతలు, కాలవ వెంట చెట్ట పట్టి నడుస్తూ
చెట్ల నుండి పండి రాలి పడిన నేరేడు పళ్ళు ఎరుకుని కాలవ నీళ్ళలో కడుక్కుని తినేయటం, తాటి ముంజెలు, సమయం ఇట్టే గడిచి పోయేది వాడికి.
‘కోటలోని చినవాడా, తోటకు వచ్చావా, వేటకు వచ్చావా, జింక పిల్ల కోసమో, ఇంకా దేనికోసమో, జింక కన్నులున్న చిన్న దాని కోసమో..”
అంటూ పాడుతూ ఆట పట్టించి దొరకకుండా పారిపోయేది. హాస్టల్ కి వెళ్ళిన తరవాత మళ్ళీ చదువులలో పడిపోవటం. ఇవన్నీ ఒక
ఎత్తైతే, కాత్యాయనితో స్నేహం ఒక ఎత్తు. కళ గల ముఖం, స్వచ్చమైన నవ్వు, పొడుగాటి జుట్టు
దువ్వుకునేటప్పుడు అద్దంలో తనని చూసి చిలిపిగా నవ్వే కళ్ళు,
తనని చూసినప్ప్డుడు ఆ కళ్ళలో మెరుపు, కలుపుగోలుతనం బాగా
ఆకర్షించేది. అందుకని ఇక్కడే ఉంటే భారతీయత, తెలుగుతనం నేర్చుకుంటానని, ఆ వంకతో పట్టుబట్టి హాస్టల్లో చేరాడు. డిగ్రీ
పూర్తయ్యాక తాతగారి దగ్గరే ప్రాక్టీస్ కూడా చేయాలని వాడి ఆలోచన.
తాత గారిని
అప్పుడప్పుడు కలిసి సెలవులు గడిపి వెనక్కి వెళ్లిపోవటం తరచూ జరిగే కార్యక్రమమే. కానీ, ఇన్నాళ్ళూ పరీక్షలవ్వటం వలన, హాస్టల్ నుండి కదలటానికి కూడా తీరుబడి కాలేదు, రావటానికి కుదరలేదు. ఆ ఉదయం ఆదివారం, మర్నాడు,
ఆ మర్నాడు సెలవులు కావడంతో, ఆలస్యంగా నిద్ర లేచినప్పటికీ, పనులన్నీ చకచకా చేసుకుని
మధ్యాహ్నం దొరికే చిరునిద్రను త్యాగం చేసి, ఆరు గంటల బస్సు ప్రయాణం తదనంతరం రెండు గంటల ఎద్దుల బండి ప్రయాణం చేసి ఎట్టకేలకు,
మోహన్ సాయంకాలం ఏడు గంటలకి తాత గారి ఇల్లు చేరుకున్నాడు.
పంతులు గారు
ఇంటికి ఎదురుగా ఉన్న వేప చెట్టు క్రింద నులక మంచం పై కూర్చొని చుట్ట కాలుస్తున్నారు,
చుట్టూ మరో నలుగురు ఊరి పెద్దలు మాట్లాడుకుంటూ కాలక్షేపము చేస్తూ ఉన్నారు.
మనవణ్ణి అల్లంత దూరం
నుండి చూస్తూనే, "ఎవరూ?" అని కళ్ళజోడు సవరించుకుంటూ,
నెమ్మదిగా చేతి కర్ర సాయంతో లేచి పలకరించారు కృష్ణమూర్తి పంతులుగారు. “ఒరే ఒరే ఒరే! నువ్వేనారా! ఎన్నాళ్ళకెన్నాళ్ళకు!” అని మనవణ్ణి గట్టిగా హత్తుకున్నారు.
‘తాతయ్యా ఆగండి
ఊపిరందట్లేదు’ అని నెమ్మదిగా
విడిపించుకుని, కాళ్ళకు దండం పెట్టాడు మోహన్. ఫరవాలేదు, మన
పద్ధతులు మరచి పోలేదు అనుకుని, ఇక వెళ్ళొస్తామని బయలుదేరారు గ్రామ పెద్దలు.
పదరా, ఇంట్లో
అత్తయ్యా వాళ్ళున్నారు, అని ఇంట్లోకి తీసుకెడుతూ, "ఏవోయ్, ఎవరొచ్చారో చూసావా" అంటూ బామ్మని కేకేసాడు.
‘ఆ ఆ వచ్చె వచ్చే’ అంటూ లోపలనుండి చేతులు తుడుచుకుంటూ, బామ్మగారు వచ్చారు.
'కళ్ళు
ఆలిచిప్పలంత వేసుకుని చూస్తావా, మనవడి తో ఏమైనా
పలకరించేదుందా' అంటున్న తాత
గారికి చిరునవ్వే జవాబుగా ఇస్తూ, ‘ఒరే, ఎప్పుడొచ్చావురా, రా పెరట్లో కాళ్ళు కడుక్కురా’ అని లోపలకు దారి చూపించింది.
మోహన్ చాలా
ఆనందంగా, ‘బామ్మా, ఎలా ఉన్నావు’ అంటూ దగ్గరగా
వచ్చి అక్కున చేరాడు.
‘బానే ఉన్నానురా’ అని, ‘కబుర్లకేం కానీ, లోపలకి పదండి ఏవేళప్పుడు తిన్నాడో ఏమొ’ అని భోజనాలగది వైపు దారి తీసింది.
బాసిం పట్టు
వేసుక్కూచుని, ఔపోశన ఇచ్చి
భోజనానికి ఉపక్రమిస్తూ అడిగారు తాత గారు, "ఆ చెప్పరా, ఏమిటి విశేషాలు" అని, తెల్లని అన్నం చిన్ని మెతుకులు ముందుగా
నొట్లోవేసుకుంటూ. తాతగారి
పలకరింపులో చిలిపితనం గమనించక పోలేదు.
"ఏముంది తాతయ్యా,
ఇప్పటి వరకు సెమెస్టర్
పరీక్షలు అయిపోయాయి, రెండు రోజులు
సెలవ రావడంతో మిమ్మల్ని చూడాలనిపించి ఇలా వచ్చాను అన్నాడు.
'ఔనవును, తెలిసింది, ఆలస్యంగా అయినా సీట్ దొరికిన వెంటనే వెళ్ళి
జాయిన్ అయ్యావని రాసాడు మీ నాన్న.' ‘నువ్వేందుకొచ్చావో నాకు తెలుసు లేవొయ్’
అన్నట్లుగా నవ్వుతూ అన్నారు తాతగారు.
బామ్మ గారు వడ్డన
చేస్తూ, 'మీ అమ్మ వాళ్ళతో
ఈ మధ్యన మాట్లాడావురా, ఎలా ఉన్నారు?'
అంటూనే 'ఇంకొంచెం వేసుకోరా, ఈ రొజు అరటి దూట కూర, నీకు ఇష్టం కూడాను’ అంటూ మరో గరిటెడు
వడ్డించింది.
"బాబొయ్, బామ్మా చాలు చాలు’ అంటున్నా కొసరి కొసరి మాగాయ
పెరుగు వడ్డించింది ఆవిడ.
’ఒరేయ్ మోహనూ,
ఇదుగో కందిపచ్చడి వేసుకో
పెరుగులో”, బాగుంటుంది అని
వాళ్ళ పెద్దత్త మరి కాస్త వడ్డించింది.
హాస్టల్ నిద్రా,
మెస్సు భొజనానికి అలవాటైన
మోహన్కి కొంచెం భుక్తాయాసం వచ్చినట్లు గానే ఉంది. అలసి పోయి మడత మంచం మీద
వసారాలోనే హాయిగా నిద్ర పట్టేసింది.
మర్నాడు ఉదయమే
లేచి తాతయ్య తో బాటు పొలానికి వెళ్ళి, అక్కడ నీళ్ళు పెడుతున్న పాలేరులు వాళ్ళతో
మాట్లాడి, చెరువులో ఈత
కొట్టి బయల్దేరారు, దారిలో పాలేరు వాళ్ళ అమ్మాయి ఇచ్చిన వేరుసెనక్కాయలు నముల్తూ.
కాత్యాయని
అప్పటికి పద్దెనిదేళ్ళు ఉంటుందేమో, మరింత అందంగా
కనబడింది తన కళ్ళకి. పక్క ఊళ్ళో కాలేజీలో చదువుతోంది. తండ్రికి సహాయం చేయాలని, అప్పుడప్పుడు ఆమె కూడా సెలవులకి వస్తూంటుంది.
చదువుకునే వేళకు వెళ్ళిపోతుంది. ఆమె కూడా మర్నాడు డీలక్స్ బస్సులో వెళ్ళిపోతుంది.
పది నిమిషాలు
కూడా ఊరుకోకుండా ఒకటే గలగలా మాట్లాడుతు౦టే, అవాక్కయి అలాగే చూస్తూ ఉండిపోయాడు.
చిన్నప్పుడు కూడా ఇంతే. తనని ఒక్క మాట మాట్లాడనీయదు. పైగా ఏయ్ మొద్దబ్బాయ్ అంటూ
మళ్ళీ ఆట పట్టిస్తుంది. ఈ మధ్యనే వయసుతో వచ్చిన మార్పులువలన కావచ్చు, వెనకటి
అంత దూకుడు లేదు, కొంచెం పెద్దమనిషి తరహాతో ప్రవర్తిస్తున్నా, చిన్న నాటి స్నేహితుడిని చూసే నాటికి ఆపుకోలేక,
చొరవ చూపించ లేక ఇబ్బంది పడుతున్నట్లుంది.
వారినే
గమనిస్తున్న తాతయ్య గారి మదిలో జ్ఞాపకాల వరవడి...
**** *** ****
శ్రీధర్ ఎం డి
చేసిన వెంటనే, ఫెలోషిప్ కి
బయల్దేరాడు. పది రోజుల ముందుగానే ప్రసూన అని వాళ్ళ కొలీగ్ తో రిజిష్టర్ మేరేజీ
చేసుకున్నాడు. మామగారు ఎన్ ఆర్ ఐ కావడంతో, పెళ్ళవగానే ఇద్దరూ బయల్దేరారు, సీమ చదువులకు.
వాడు పెళ్ళి చేసుకోవడం పెద్ద చదువులకు వెళ్ళడం ఇష్టమే అయినా, ఎలా మాట కూడా చెప్పకుండా పెళ్ళిచేసుకున్నారు
కదా, అందరూ ఉన్నప్పటికీ
అనిపించింది.
'ఏం చేయగలం నాన్నా,
ఆగష్టు లోనే ఫెలోషిప్
ఆరంభం కానుంది, ఇద్దరికీ
పెళ్ళయింది అని చూపించాలి వీసా కు వెంటనే, అప్ప్లై చేసాక పదహేను రోజులదాకా రాదు కదా, అందుకే వెంటనే చేసుకోవాల్సి వచ్చింది నాన్నా'
అని కొడుకు
అంటుంటే మనసులో బాధ ఉన్నా నవ్వుతూనే ఆశీర్వదించారు. అయినా, వాడు అలా చేసినందుకు, ఇంట్లోని శుభ
కార్యం చూడలేకపోయామే అని మనసులో ఎప్పుడో కలుక్కు మంటుంది.
ఆ తరవాత అన్నీ
ముగించుకుని కొన్నాళ్ళ పాటు వెనక్కొచ్చారు. పిల్లాడి ఎనిమిదో సంవత్సరం దాకా ఉండి
మళ్ళీ వెనక్కెళ్ళారు, వాళ్ళ నాన్న
గారికి సహాయం గా ఉండాలని, వాళ్ళ ప్రయివేటు
ఆసుపత్రిలో వీళ్ళ సహాయం కావాలి అన్నారు. అయితే మనవడు మాత్రం రక్త సంబంధం ఏమో, తాతగారితో బాగా చేరిక అయిపోయింది. వాడు
ఎప్పుడు తాత వాళ్ళ దగ్గర మనం ఎందుకు ఉండటంలేదు అని అల్లరి చేసేవాడు చిన్నప్పుడు. ఆ
పట్టుదలతోనే ఇన్నాళ్ళ తరవాత మనవడు మళ్ళీ ఎన్ ఆర్ ఐ కాలేజీలో సీట్ తెచ్చుకుని వచ్చాసాడు
చదువుల వంకతో.
*** *** ***
‘చూడండి తాతయ్యా, ఎలా మాట్లాడూతోందో, కాత్యా..' అంటూన్న మనవడి మాటలకు, ఊహల్లోంచి బయటపడ్డారు పంతులు గారు.
ఏమిటన్నట్లు
ప్రశ్నార్థకంగా చూస్తున్న తాత గారికి కంప్లేను చేస్తున్న మనవడు, ’చూడండి తాతయ్యా నేను ఈ ఊళ్ళో ఉండలేనుట, ఇక ఇక్కడ
ప్రాక్టీసు ఎలా చేస్తావు అంటోంది కాత్యాయని, ఎందుకు చెయ్యలేను తాతయ్యా, నాకూ తెలుగు బాగానే వచ్చు కదా?’ అనగానే గట్టిగా నవ్వేశారు తాత గారు.
అప్పటిదాకా
గంభీరంగా ఉన్న వాతావరణము, మరి మబ్బులో లేక చల్లటి పైరు గాలికో గాని చల్లబడూతుంది.
అప్పుడే తలలాడిస్తున్న ఎర్ర గన్నేరు పూలను చూస్తూ, "మరి ఇంకనేం ఛాలెంజ్ తీసుకోవోయ్, ధైర్యం ఉంటే!' అనేసి నవ్వారు, తాతయ్యగారు.
అక్కడ గడిపిన
రెండు రోజుల్లో, పొలానికి వెళ్లి రావడం, పాలేరులతో మాట్లాడటం, చెరువులో ఈత కొట్టి
రావడం, వీటితో అసలు సమయమే తెలియ లేదు. అన్నింటికన్నా కాత్యాయని తో స్నేహం మలయ
మారుతం లా ఉంది! మోహన్ మనసులో ఏవో మధురోహలతో గుండె లోతులలో నల్లని వరవడో మరేదో
మాటలకందని భావన, ఐఫొన్ లో నుండి 'మబ్బులు మబ్బులు
మబ్బులొచ్చినై' అని పాట వస్తూ ఉంది!
ఇహ బామ్మ గారి ఆనందాన్ని
అంచనా వేయద్దు! ఆమె ఆదరణ వంటలు
అడగనే వద్దు. 'ఏవోయ్, అస్థమాన్లూ నడుం పట్టేసిందీ
ఈరోజు కాదు, రేపూ అని అనే దానివి ఇవ్వాళ్ళేంటోయ్, చకచక గరిట
తిప్పేస్తున్నవే? అన్నా, విసుక్కోకుండా, నవ్వుతూనే ఉంది, 'ఇన్నాళ్ళకైనా తిరుగుతున్నాను కదా, నాకు పిల్లలను చూస్తే ప్రాణం. అది వాళ్ళే ఇస్తారని తెలుసు కదా' అంటూ, అత్యంత శీతలమైన చిరునవ్వులతో, తమలపాకు చిలకలు అందిస్తుంది..
………..
ఇంతలో ఎప్పుడు వచ్చిందో ఏమో నా వెనక చేరి కంప్యూటర్లో నేను రాస్తున్న కధ చూసి,
“అబ్భ కాస్త ప్రూఫ్ చేసి పెట్టండి ఈ కధ అని ఇస్తే, టీ
చేసుకొచ్చేలోపల మీ చిన్నప్పటి కబుర్లు అన్నీ నా కధల్లో పెట్టేస్తే ఎలా అంటూ
విసుక్కుంది మా ఆవిడ. ఇది మన కధే కాదుటోయ్, బొమ్మ నీదే కాస్త
రంగులు అద్దాను అంతే” అంటూ ఇంతకీ టీ పకోడీలు ఏవి అంటూ చుట్టూ చూశాను.
No comments:
Post a Comment